
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత జట్టు ప్రధాన కోచ్ గా వచ్చేందుకు ద్రవిడ్ తొలుత ఆసక్తి చూపనప్పటికీ, ఇటీవల దుబాయ్ లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో భేటీ అనంతరం అంగీకరించినట్టు తెలుస్తోంది. రూ. 10 కోట్ల జీతానికి రాహుల్ ద్రవిడ్ ఒప్పుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. వరల్డ్ కప్ అనంతరం జరిగే న్యూజిలాండ్ సిరీస్ నుంచే ద్రవిడ్ కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాఠోడ్ ను నియమించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత జట్టులో మేటి యువ ఆటగాళ్లున్నారు. ద్రవిడ్ కోచింగ్ సాయంతోనే వీరు టీమ్ ఇండియా సీనియర్ జట్టులోకి అడుగు పెట్టారు. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగియనుంది. ఐసీసీ టోర్నీ తర్వాత రవిశాస్త్రి కొనసాగే అవకాశాలు లేకపోవడంతో కొత్త కోచ్, ఇతర సహాయక సిబ్బంది కోసం బీసీసీఐ ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది.
టీమ్ ఇండియా హెడ్ కోచ్ రేసులో అందరికంటే రాహుల్ ద్రావిడ్ ముందున్నాడు. మరోవైపు దిగ్గజ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్ ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.