
ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను వదిలిపెట్టి ఎంతగానో నష్ట పోయామని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కాగా.. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతలను ఆయన ప్రత్యేకంగా కలిశారు. ఒక్కొక్కరిని పేరు పేరునా పలకరించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర ఎమ్మెల్యేలతో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో స్పందించారు.
నాగార్జునసాగర్ లో సీనియర్ నేత జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో.. అందరికీ తెలిసిందేనని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీనా? టీఆర్ఎస్సా? ఫలితం ఎలా ఉంటుంది? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. ఆ విషయం తనకు పెద్దగా తెలియదని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలు బాగా లేవని, సమాజం కూడా అలానే ఉందని పేర్కొన్నారు. ఏపీ వదిలేసి తెలంగాణకు రావాలనిపిస్తోంది.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ నేతగా కొనసాగుతున్న ఆయన.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రావడం, కాంగ్రెస్ నేతలను కలిసి మాట్లాడడం కలకలం రేపింది.