
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, పార్టీ ముఖ్యనేతల ఇళ్లపై దుండుగుల దాడుల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలతో పాటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలోని ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశాలతో పోలీసులు నారావారిపల్లెలో భారీ సంఖ్యలో మోహరించారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బుధవారం అనకాపల్లిలో పర్యటించాల్సి ఉండగా, మంగళవారం జరిగిన అవాంఛనీయ ఘటనలతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దాడులకు నిరసనగా, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహిస్తుండడంతో లోకేశ్ అనకాపల్లి పర్యటనను రద్దు చేసుకున్నారు.