
ఎయిర్ ఇండియాను టాటా సన్స్ తిరిగి దక్కించుకోనున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. 68 సంవత్సరాల తర్వాత మళ్ళి టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఈ దిశగా ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ లో కీలక ఘట్టం ముగిసినట్లు సమాచారం. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం దేశంలోని ప్రఖ్యాత సంస్థలు పోటీపడి మరీ బిడ్డింగ్ లో పాల్గొన్నాయి. ఇందులో టాటా సన్స్ ను విజయవంతమైన బిడ్డర్ గా ఎంపిక చేసినట్లు బ్లూమ్ బర్గ్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. కానీ, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంగానీ, టాటా సన్స్ సంస్థగానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
విజయదశమి (అక్టోబరు 15) రోజున విజయవంతమైన బిడ్డర్ పేరును ప్రకటించాలని కేంద్రం భావించింది. కానీ, ఇంతలోనే విషయం ఇలా బయటకు రావడంతో.. అధికారిక ప్రకటన కూడా ఇప్పుడే వెలువడే అవకాశం ఉందని సమాచారం. లేదంటే.. అక్టోబరు 15నే వెల్లడయ్యే చాన్స్ ఉంది. ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు పదుల సంఖ్యలో బిడ్లు దాఖలు కాగా, వాటిలో టాటా దాఖలు చేసిన బిడ్ ఆకర్షణీయంగా ఉందని మొదట్లోనే వార్తలు వచ్చాయి.