
ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్‌శర్మ ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా ఆడుతూ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. టీ20 ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.
రాహుల్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, 47 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఆఫ్ఘన్ బౌలర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి 15వ ఓవర్ ఐదో బంతికి కరీం జనత్ బౌలింగ్ లో రోహిత్ అవుటయ్యాడు.
ఆ తర్వాత ఏడు పరుగులకే గుల్బాదిన్ బౌలింగులో రాహుల్ బౌల్డయ్యాడు. వీరిద్దరి ఔట్‌తో క్రీజులోకి వచ్చిన పంత్, హార్దిక్ పాండ్యా కూడా మరింత దూకుడు గా ఆడారు. పంత్ 13 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 27 పరుగులు చేయగా, పాండ్యా 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అలాగే, ఈ మ్యాచ్‌లో 74 పరుగులు చేసిన రోహిత్ ఖాతాలో ఓ కొత్త రికార్డు వచ్చి చేరింది. ఐసీసీ టోర్నీల్లో (వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. 3662 పరుగులతో ఈ జాబితాలో ఇప్పటి వరకు జో రూట్ అగ్రస్థానంలో ఉండగా, 3682 పరుగులతో రోహిత్ అతడిని అధిగమించాడు.
భారత్ నిర్దేశించిన 211 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. జట్టులో కరీం జనత్ (42), కెప్టెన్ నబీ (35) మాత్రమే భారత బౌలర్లను కాసేపు ఎదురొడ్డి పరుగులు సాధించగలిగారు. రహమానుల్లా గుర్బాజ్ 19, గులాబ్దిన్ నైబ్ 18 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ రెండు, బుమ్రా, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత జట్టు సెమీఫైనల్ ఆశలు మళ్లీ చిగురించాయి. రేసులో ఉండాలంటే కోహ్లీ సేన మిగతా రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. ఆ రెండు జట్లు స్కాట్లాండ్, నమీబియా వంటి చిన్న జట్లు కావడంతో విజయం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, న్యూజిలాండ్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాలి. అయితే, ఆ జట్టు కూడా తన తర్వాతి మ్యాచ్‌ల్లో నమీబియా, ఆఫ్ఘనిస్థాన్ లతో తలపడుతుంది కాబట్టి, న్యూజిలాండ్ కు విజయం నల్లేరు మీద నడకే కావొచ్చు. కాబట్టి భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే!