
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా షార్జా స్టేడియంలో ఆఫ్ఘానిస్తాన్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. స్కాట్లాండ్ పై ఆఫ్ఘానిస్తాన్ 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 60 పరుగులకే ఆలౌట్ అయిన స్కాట్లాండ్, టీ20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుంది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 10.2 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది.
మొదటి 3 ఓవర్లు ముగిసేసరికి 27/0 పరుగులు సాధించిన స్కాట్లాండ్ ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. కొద్దిసేపటికే 3 పరుగుల తేడాలో 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది స్కాట్లాండ్. 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన ఓపెనర్ జార్జ్ మున్సీ (25) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా విఫల కావడం వల్ల స్కాట్లాండ్ ఘోర పరాజయం పాలైంది.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో ముజిబుర్ రెహ్మాన్ ఐదు, రషీద్ ఖాన్ నాలుగు, నవీన్-ఉల్-హక్ ఒక వికెట్ తీశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ లో మూడు, నాలుగు, ఐదో బ్యాట్స్మెన్ డకౌట్ కావడం విశేషం. 2014లో శ్రీలంకపై న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ మెక్ కల్లమ్, రాస్ టేలర్, జేమ్స్ నీశమ్ డకౌట్ అయిన తర్వాత టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ నజీబుల్లా జద్రాన్ (59) అర్ధ శతకంతో రాణించడం వల్ల.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రాతుల్లా జజాయి (44), మహమ్మద్ షెహజాద్ (22) జట్టుకు శుభారంభం అందించారు. వేగంగా ఆడే క్రమంలో షెహజాద్ షరీఫ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహ్మానుల్లా (46)తో కలిసి మరో ఓపెనర్ హజ్రాతుల్లా ధాటిగా ఆడాడు. షరీఫ్ వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతికి నజీబుల్లా జద్రాన్ ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన కెప్టెన్ మహమ్మద్ నబీ (11) నాటౌట్ గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో షరీఫ్ రెండు, మార్క్ వాట్, జోష్ డేవీ తలో వికెట్ తీశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది.
స్కాట్లాండ్ కి ఇదే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అత్యల్ప స్కోరు కాగా, ఓవరాల్ గా ఐదో లోయెస్ట్ స్కోరు. ఇంతకుముందు నెదర్లాండ్స్ 39, 44, వెస్టిండీస్ 55, న్యూజిలాండ్ 60 పరుగులకు ఆలౌట్ అయి స్కాట్లాండ్ కంటే ముందున్నాయి. 130 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆఫ్ఘాన్, కెన్యాపై 2007లో శ్రీలంక అందుకున్న 172 పరుగుల విజయం తర్వాత టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అతిపెద్ద విజయాన్ని నమోదుచేసింది.
Mujeeb, Rashid in full flight as Afghanistan register a 130-run win against Scotland ?#AFGvSCO report ? #T20WorldCup https://t.co/oOSXoWfvx1
— ICC (@ICC) October 25, 2021