
టీ20 ప్రపంచకప్ లో భాగంగా శుక్రవారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 3 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. ఆఖరి బంతికి 4 పరుగులు చేయాల్సిన తరుణంలో బంగ్లాదేశ్ జట్టు ఒత్తిడికి గురైంది. 143 పరుగుల ఛేదనలో లిటన్ దాస్ (44), మహ్మదుల్లా (31*) రాణించారు. విండీస్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ఛేదించలేక 139/5కే పరిమితమైంది. విండీస్ బౌలర్లలో రస్సెల్, హొసెన్, రవి రాంపాల్, బ్రావో, హోల్డర్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4) ఘోరంగా విఫలమయ్యారు. అరంగేట్ర ఆటగాడు రోస్టన్ ఛేజ్ (39), ఆఖర్లో వచ్చిన నికోలస్ పూరన్ ఆదుకున్నారు. జేసన్ హోల్డర్ (15), పొలార్డ్ (14) నాటౌట్ గా నిలిచారు.
బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్ రెండేసి వికెట్లు తీశారు. తక్కువ పరుగుల తేడాతో విండీస్ గెలవడం ఇది మూడోసారి. ఇంతకముందు 2011లో పాకిస్తాన్ పై 7 పరుగుల తేడాతో.. ఆ తర్వాత భారత్ పై 2016లో కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం విశేషం. థ్రిల్లింగ్ విక్టరీతో విండీస్ సెమీస్ రేసులో ఉండగా.. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన బంగ్లా ఇంటిదారి పట్టనుంది.