
టీ 20 ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి సమయం ఆసన్నమైంది. అర్హత పోటీలు పూర్తి అయ్యాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, స్కాట్లాండ్, నమీబియా జట్లు సూపర్-12 దశకు అర్హత సాధించాయి. ఇక నేటి నుంచి అసలు సిసలు సంగ్రామం మొదలు కానుంది. రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండీస్ మరోసారి కప్పు అందుకుంటుంటా..? 2019 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ రెండో సారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడుతుందా..? ఇప్పటి వరకు ఆస్ట్రేలియాకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్‌ను అందుకుంటుందా..? ధోని మార్గనిర్దేశంలో కోహ్లీ సారధ్యంలో టీమ్ఇండియా 12 ఏళ్ల తరువాత మరోసారి కప్పు గెలుచుకుంటుందా అన్న అభిమానుల సందేహాల మధ్య నేటి నుంచి మహా సంగ్రామం మొదలుకానుంది.
ఈ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్నా.. కరోనా కారణంగా యూఏఈ వేదికగా మ్యాచ్‌లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. స్టేడియంలోకి పరిమితంగానే ప్రేక్షకులకు అనుమతి ఉంది. ఇక నేడు రెండు మ్యాచ్‌లు జరగనుండగా.. గ్రూప్-1 తొలి పోరులో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడుతుంది. మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ పోటి పడనుంది. ఇక భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను రేపు పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాక్‌ను ఓడించి టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఘనంగా బోణీ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
భారత్ ఆడే మ్యాచ్‌ల వివరాలు ఇవే.. అక్టోబర్ 24 – పాకిస్థాన్ తో దుబాయ్ వేదికగా అక్టోబర్ 31 – న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా నవంబర్ 3 – అఫ్గానిస్థాన్ తో అబుదాబి వేదికగా నవంబర్ 5 – స్కాట్లాండ్ తో దుబాయ్ నవంబర్ 8 – నమీబీయాతో దుబాయ్ ఈ మ్యాచ్‌లు అన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇక తొలి సెమీఫైనల్ 10న, రెండో సెమీ ఫైనల్ 11న, నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.