
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన తొమ్మిది మంది జడ్జీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ ఎన్వీ రమణ.. వారితో ప్రమాణం చేయించారు. ఒకేసారి తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి సాగిన ఈ కార్యక్రమం.. ఈ ఉదయం 10:30కి ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ మెట్రోస్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన సుప్రీం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా సాగింది. ఈ కార్యక్రమానికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ హాజరయ్యారు.
ముందుగా జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా (కర్ణాటక హైకోర్ట్ సీజే)తో సీజేఐ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. అనంతరం వరుసగా జస్టిస్ విక్రమ్ నాథ్ (గుజరాత్ హైకోర్ట్ సీజే), జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి (సిక్కిం హైకోర్ట్ సీజే), జస్టిస్ హిమా కోహ్లి (తెలంగాణ హైకోర్ట్ సీజే), జస్టిస్ బీవీ నాగరత్న (కర్ణాటక హైకోర్ట్ న్యాయమూర్తి), జస్టిస్ సీటీ రవికుమార్ (కేరళ హైకోర్ట్ న్యాయమూర్తి), జస్టిస్ ఎంఎం సుందరేశ్ (మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి), జస్టిస్ బేలా ఎం త్రివేది (గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి), జస్టిస్ పీఎస్ నరసింహ (సుప్రీం సీనియర్ న్యాయవాది, మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్)తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం.. నూతన న్యాయమూర్తులకు సీజేఐ ఎన్వీ రమణ అభినందనలు తెలిపారు. వీరిలో జస్టిస్ పీఎస్ నరసింహ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన వారు.