
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నయనతార, ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నాత్తే’. ఈ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’గా రాబోతోంది. ‘పెద్దన్న’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్ రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ‘పెద్దన్న’ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసారు. ఇది కూడా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది.
గతంలో అజిత్ తో వీరమ్, విశ్వాసం లాంటి సినిమాల్లో కూడా ఎక్కువగా విలేజ్ కథలనే చూపించాడు దర్శకుడు శివ. ఈ సినిమాలో పంచాయతి పెద్దగా రజినీకాంత్ కనిపిస్తున్నాడు. మరో వైపు ఈ సినిమాలో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. రజినీ నటించిన ఎన్నో సినిమాలకు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎస్పీ బాలు పాడారు. గతేడాది సమ్మర్ లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేశాడు. తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’ సాంగ్ ను కూడా ఎస్పీ బాలు ఆలపించారు. త్వరలో తెలుగు పాటను విడుదల చేయనున్నారు. అన్నాత్తే టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా బాగానే ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.