
మంత్రి కేటీఆర్ గొప్ప నటుడంటూ హీరో సుధీర్ బాబు కితాబిచ్చాడు. కేటీఆర్ లో రాజకీయ నాయకుడి కంటే నటుడు బాగా కనిపిస్తారని అన్నాడు. హైదరాబాద్ హైటెక్స్ లో ‘ఇండియా జాయ్’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఈ సరదా సంభాషణ సాగింది. సుధీర్ బాబు మాటలు విన్న కేటీఆర్ నవ్వుతూ ఆ మాటలను మనసులో పెట్టుకుంటానని బదులిచ్చారు.
ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ కేటీఆర్ కు తాను పెద్ద అభిమానిని అన్నారు. ఒక మంచి రాజకీయ నాయకుడిలో ఒక మంచి నటుడు కూడా ఉంటాడన్నారు. ‘‘ఒక నటుడు అన్నీ మరిచిపోయి పాత్రకు తగినట్లు నటించాలి. అలాగే రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు మంచి చేయాలంటే తన గురించి తన కుటుంబం గురించి మరిచిపోయి పనిచేయాలి. అలాంటి వ్యక్తే కేటీఆర్. ఒకవేళ భవిష్యత్ లో నేను రాజకీయ నాయకుడి గా నటించే అవకాశం వస్తే కేటీఆర్ ను అనుసరిస్తా. ఆయన లాగే ఉండేందుకు ప్రయత్నిస్తా…’’ అని సుధీర్ బాబు చెప్పాడు. కేటీఆర్ సినిమాల్లోకి రానందుకు ఆనందంగా ఉందని అన్నాడు.
సుధీర్‌బాబు మాటలు ఆసక్తిగా విన్న మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. సుధీర్ తనను అనుకోకుండా నటుడిని చేశాడని అన్నారు. ‘నన్ను పొలిటీషియన్ కంటే నటుడిగా బాగుంటావన్నాడు. ఏంటి సుధీర్? నేను రాజకీయ నాయకుడి కాకుండా నటుడిగా కనిపిస్తున్నానా? ఓకే సుధీర్.. ఇది నేను మనసులో పెట్టుకుంటా! ఏది ఏమైనా ఈ విషయాన్ని నేను చాలా పాజిటివ్ వేలో చూస్తున్నా.. ’ అని మంత్రి కేటీఆర్ జవాబిచ్చారు.