
మహా లక్ష్మి, పార్వతి, సరస్వతీదేవి ల కలయికే మహాశక్తి జగన్మాత .. ఈ ముగ్గురి శక్తుల కలయికతో.. దుష్టసంహరణార్థం ఓ మహాశక్తి ఉద్భవించింది. ఆమె.. ఆదిపరాశక్తి. మహిషాసుర సంహారం కోసం ఆ దుర్గామాత అవతరించి.. నవ దినాలు నవ రూపాలతో.. ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులను ఒక్కటి చేసి.. ఓ మహా శక్తిగా రూపాంతరం చెంది.. లోక రక్షణ కోసం దశమినాడు మహిషుడ్ని సంహరిస్తుంది. అనంతరం శాంతమూర్తిగా మారిన ఆ దుర్గామాతను.. రోజుకో అలంకరణలో భక్తులు పూజిస్తారు. నవరాత్రులు నవ అలంకరణలతో ఆ అమ్మలగన్న అమ్మ.. భక్తులను కరుణిస్తుంది. తొలి మూడు రోజులు పార్వతీదేవిగా, ఆ తర్వాతి మూడు రోజులు లక్ష్మీ దేవిగా, చివరి మూడు రోజులు సరస్వతీదేవిగా ఆ మహాశక్తి పూజలందుకుంటుంది.
1. పార్వతీదేవి హిమవంతుని కుమార్తె గనుక తొలిరోజు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అవతారంలో ఆమె వాహనం వృషభం. కుడిచేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. ఎడమచేతిలో కమలం ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే తల్లి కనుక తొలిరోజున భక్తులు ఈ దేవిని పూజిస్తారు.
2. రెండోరోజు ‘బ్రహ్మచారిణి’ అవతారంలో అమ్మవారు భక్తులను కటాక్షిస్తారు. గత జన్మలో తాను దక్షుడి కుమార్తె ‘సతీదేవి’నని నారదుడి ద్వారా తెలుసుకుని, ఆయన ఉపదేశంతో ఈ జన్మలోనూ శివుడ్ని భర్తగా పొందాలని బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారు తపస్సు చేస్తుంది. కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం. శ్వేత వస్త్రధారిణియై తపస్సు చేసింది కనుక తపశ్చారిణి అని కూడా అంటారు. బ్రహ్మచర్యం పాటించినందున బ్రహ్మచారిణి. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని పూజిస్తే.. సాధు జీవనం అలవడుతుందని, అన్నింటా విజయం కలుగుతుందని అంటారు.
3. మూడోరోజు ‘చంద్రఘంట’ అవతారం. దశ భుజాలు, ధనుస్సు, బాణం, గద, శూలం, ఖడ్గం, పాశం లాంటి ఆయుధాలు, పద్మం, కమండలాలతో కొలువుదీరిన ఈ తల్లిని పూజించడం వల్ల శత్రువులను జయించే శక్తి సిద్ధిస్తుందన్నది భక్తుల విశ్వాసం.
4. నాలుగోరోజు ‘కూష్మాండ’ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఇది భూమికి ప్రతీక. ఆ ఆదిపరాశక్తి.. విశ్వాన్ని సృష్టించిందని, అందుకే నాలుగోరోజున ఆ అవతారంలో అమ్మను కొలుచుకుంటారని అంటారు. ఈ అలంకరణలో అమ్మవారు ఎనిమిది చేతులు కలిగి ఉంటారు. ఓ చేతిలో చక్రం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో ధనుస్సు, బాణం తదితర ఆయుధాలతో పాటు, కమండలం, అమృత కలశం, జపమాల, పద్మం ధరించిన ఈ మాతను పూజిస్తే రోగాలు, బాధలు నశిస్తాయంటారు.
5. అయిదోరోజు స్కందమాత. ఈ అవతారంలో అమ్మవారు సింహవాహిని. ఓ చేతిలో కుమారుడు స్కందుణ్ని, మరో రెండు చేతులతో పద్మాలనీ, మరోచేయి అభయముద్ర. ఈ తల్లి శాంతరూపిణి. స్కందుని తల్లి కనుక ‘స్కందమాత’. ఈ శాంత స్వరూపిణి పూజతో శాంతి, సౌఖ్యం కలుగుతాయి.
6. ఆరోరోజు కాత్యాయని అవతారం. త్రిమూర్తుల తేజంతో మహిషాసురుడ్ని సంహరించడానికి ఎత్తిన రూపం. ఈ రూపంలోని అమ్మవారిని ముందుగా కాత్యాయనుడు అనే ముని పూజిస్తాడు. అందుకే ఈ అవతారానికి ఆ పేరు వచ్చింది. నాలుగు చేతులు కలిగిన అమ్మవారు.. సింహంపై కూర్చుని భక్తులను కటాక్షిస్తుంది. ఒక చేతిలో ఖడ్గం, మరో చేత కమలం ధరించిన అమ్మవారు.. ఇంకో చేతిని వరముద్రగా, మరోదాన్ని అభయహస్తంగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో ఉన్న అమ్మవారి పూజతో రోగాలు, కష్టాలు తీరుతాయి.
7. ఏడోరోజు కాళరాత్రి. తల విరబోసుకుని, నల్లని మేనిరూపుతో, నాలుగు భుజాలు కలిగి ఉన్న ఈ అమ్మవారికి.. వాహనం గార్దభం. రెండు చేతులతో అభయ హస్తం ఇస్తుండగా.. మిగిలినవి వర ప్రసాద ముద్రగా ఉంటాయి. ఈ అవతారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే.. పాపాలు, గ్రహబాధలు తొలగిపోతాయి.
8. ఎనిమిదోరోజు మహాగౌరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమె వృషభ వాహిని. చతుర్భుజాలు కలిగి ఉంటుంది. నాలుగు చేతుల్లో త్రిశూలం, డమరుకం, అభయహస్త ముద్ర, వరప్రసాద ముద్రలు కలిగి ఉంటుంది. తెల్లటి మేని ఛాయ. శ్వేత వస్త్రధారిణి. ఈమెను పూజిస్తే.. పాపాలు తొలగి.. శుభాలు కలుగుతాయి.
9. తొమ్మిదోరోజు సిద్ధిధాత్రి. సర్వసిద్ధులను ప్రసాదించేది కనుక ఈమెకీ పేరు. ఈ అవతారంలో అమ్మవారి ఆసనం.. కమలం. శంఖం, చక్రం, గద, పద్మాలను నాలుగు చేతుల్లో ధరించి.. భక్తుల కటాక్షిస్తుంది. ఈమెను పూజిస్తే సర్వసిద్ధులూ, సుఖసంతోషాలు కలుగుతాయి.
ఇక ఈ నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో అలంకరణలో దర్శనమిస్తారు. విదియనాడు బాలాత్రిపురసుందరిగా, తదియ నాడు లలితా త్రిపురసుందరిగా, చవితి నాడు గాయత్రీదేవిగా, పంచమి రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. షష్ఠి నాడు సరస్వతీదేవిగా, సప్తమి రోజు మహాలక్ష్మిగా, అష్టమి నాడు దుర్గాదేవిగా, నవమి నాడు మహిషాసుర మర్దనిగా, దశమి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిస్తారు.
మార్కండేయ పురాణంలో మహాకాళి, మహిషాసురమర్దని, చాముండి, నంద, రక్తదంతిక, శాకంబరి, దుర్గ, మాతంగి, భ్రామరి అంటూ తొమ్మిది దేవీ రూపాలు చెప్పారు. వీటితో పాటు ప్రాంతీయ భేదాలను బట్టి రూపాలు, నామాలు మారినా, నవమ సంఖ్య మాత్రం మారదు.