
“ఏందే …
వీడు ఇవాళ స్కూల్కు పోలేదు.. అసలే టెన్త్ క్లాస్..
ఏమైందో అడిగినవా”.. . భార్యను అడిగిండు కేశవరావు…!
ఆ ఊర్లో ఆయనే ధనవంతుడు… !
కారూ … .కలర్ టీవీ లాంటి విలాస వస్తువులను ఆ ఊరికి మొదటగా పరిచయం చేసింది వాళ్లే..!
అలా తమకున్న సంపదతో ఆ ఊర్లో అన్నిట్లో తామే ఎక్కువ అనే భావన ఆ కుటుంబంలోని చిన్నా పెద్దా అందరిలోనూ నిండిపోయింది..!
ఊర్లో జనాలందరూ వారి గురించి అలానే అనుకొనేవారు కూడా..!
“ఏమో ఇప్పటికి రెండ్రోజులైంది..
వాడు ఆ పుస్తకాల నుంచి తలకాయ బయట పెట్ఠక..
ఏందిరా పవ్వీ.. ఇప్పుడేం పరీక్షలు లేవుకదా .. రెండ్రోజుల నుంచి పొద్దస్తమానం చదువుతునే ఉన్నవ్.. “
భర్త మాటకు సమాధానంగా కొడుకు పవన్ ను ప్రశ్నించింది తల్లి..!
అమ్మా….
ఎల్లుండి టీచర్స్ డే … టీచర్స్ డే నాడు మాకు మేమే పాఠాలు చెప్పాలె.. సార్లు చూసి మంచిగ చెప్పినోల్లకు ఫ్రైజ్ లు ఇస్తరు ..!
పోయినసారి
తొమ్మిదో తరగతిల టీచర్స్ డే నాడు ..
అందరికంటె మంచిగ తయారై ….
ఇస్త్రీ బట్టలేసుకొని సార్ల లెక్కనే తయారైపోయి స్కూల్లో ఇంగ్లీష్ పాఠం చెప్పిన ….!
నా లెక్క తయారై ఒక్కడు కూడా రాలే..
ఫస్ట్ ప్రైజ్ నాదే అని మా దోస్తు గాల్లం అందరం అనుకున్నం కూడ… !
లాస్ట్ బెల్ కు హెడ్మాస్టర్ రాములు సార్ అందరినీ గ్రౌండ్ ల కూసోపెట్టిండు..!
ఫస్ట్.. సెకండ్.. థర్డ్ ప్రైజ్ లుంటయని చెప్పి.. మొదలు నాపేరే పిలవంగనే మా దోస్త్ గాల్లందరు చప్పట్లు కొడుతుంటే పొంగిపోయి స్టేజీ మీదికి ఎక్కంగనే అది థర్డ్ ప్రైజని చెప్పి నా చేతుల ఓ నోట్ బుక్ పెట్టంగనే.. చప్పట్లు ఆగిపోయినయి..!
నాకు ఇజ్జత్ పోయినట్టనిపించింది….!
కోపంతోటి ఆ ఫ్రైజ్ ను అక్కడ్నే విసిరేద్దామనిపించింది…!
రాములు సార్ మొకంల మొకం పెట్టి కోపంగ చూసిన…. !
సార్ కు నా కోపం అర్థమైనా…
సైన్స్ పాఠం మంచిగ చెప్పిందని కాపోల్ల పిల్ల శ్యామలను పిలిచి రెండో ప్రైజ్ “మంచి స్కూల్ బ్యాగ్” చేతుల పెట్టిండు…!
స్టేజి దిగి దోస్తుగాల్ల దగ్గరకి పోతున్నప్పుడు ఫస్ట్ అనుకున్నోనికి థర్డ్ వచ్చింది అని జాలిపడుతూ చూస్తున్న వారి చూపులకు నాకు అక్కడ ఉండ బుద్ధి కాలేదు…..!
కాకపోతే ఫస్ట్ ప్రైజ్ ఎవరికిస్తరో చూద్దామని అందరితోపాటు నేనూ ఎదురుచూస్తుంటే….
ఊర్లో పాలుపోసే గంగయ్య కొడుకు మోహన్ గాని పేరు పిలిచిండు రాములు సారు…!
వాడు ఎనిమిదో తరగతోల్లకు తెలుగు పాఠం చెప్పిండట…!
వాని పేరు పిలుస్తరని వాడు కూడ అనుకోలేదేమో.. అందుకే మూడు సార్లు పిలిచినట్టున్నడు సారు..!
గుండీలు కూడా సరిగా లేని అంగీ..
పాత నెక్కరు.. అరిగిపోయిన స్లిప్పర్లతో లేచి నిలబడ్డ వాన్ని స్టేజీ పైకి పిలిచి ఫస్ట్ ప్రైజ్ కింద కొత్త సైకిల్ తాళం చెవులు చేతుల పెట్టేసరికి .. నా మొకం ఎక్కడ పెట్టుకోవాన్నో తెలువలే!
తెల్లారి ప్రేయరైనాంక.. సార్లు కూసుండే రూంల రాములు సార్ ను నిలదీస్తే… “అరేయ్ నువ్వు బాగా చెప్పినందుకే నీకు థర్డ్ ప్రైజ్ ఇచ్చినా …. ఫస్ట్ ప్రైజ్ మోహన్ గానికి ఎందుకు ఇచ్చిన్నో ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థంకాదు..!
నెక్స్ట్ ఇయర్ పదోతరగతి ల నీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టు నీకు నువ్వే టార్గెట్ పెట్టుకోమని చెప్పిండు సారు… అందుకే మంచిగ చదువుతున్న ” అని అమ్మకు చెప్పిండు పవన్…!
ఈ సారి పోయినేటి లెక్క ఉ
ఊర్ల నా ఇజ్జత్ తియ్యకురో.. కావాలంటే మీసార్ కు నేను చెప్పాన్నా అని అంటున్న నాన్న మాటలకు ఔననాలో.. కాదనలో అర్థం కాలేదు పవన్ కు.. !
నాన చెపితే భయానికి ఏదో ఒకటి మా ఇస్తడు కావచ్చు సారు..
ఎందుకంటే పోయినేడు అట్ల ఎందుకు చేసిండో ఇప్పటికి చెప్పలేదు..!
అటువంటిది నాకు వద్దు అనుకొని …. “సారుకు చెప్పుడు ఏమద్దు” అని తండ్రితో ఖరాఖండిగ చెప్పిండు పవన్…!
తెల్లారి….
స్కూల్లో అందరూ రేపటి ఉపాధ్యాయుల దినోత్సవంలో ఎవరికి.. ఏ ప్రైజ్ వస్తదో అనే మాట్లాడుకుంటున్నరు…!
గ్రౌండ్ల యాపచెట్టు కింద మోహన్ గాన్తోని మస్త్ సేపు ముచ్చట పెట్టిండు రాములు సారు…!
ఇగ దాంతోటి ఈ సారి కూడ వానికే ఫస్ట్ ప్రైజ్ అని అనుకోవడం మొదలు పెట్టిండ్రు అందరు..!
లంచ్ టైంల ..
“ఈ సారి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడానికి తయారైనవురా పవన్ .. అని భుజం తట్టి.. అరేయ్ ఆ మోహన్ గాన్ని నా దగ్గరికి పంపు అని క్లాస్ రూంలకు పంపిండు రాములు సార్…!
మోహన్ గాన్ని పిలువుమనుడూ..
వాన్తోని మాట్లాడుడు చూస్తుంటే ఈ సారి కూడా వానికే ఇస్తరని అనుమానం వచ్చింది పవన్ కు..! అలాంటప్పుడు ప్రిపేర్ అయినవా అని తననెందుకు అడుగుతుండో అర్థం కాలేదు….!
***
సెప్టెంబర్ 5 ..
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు
ఎమ్మెల్యే గారికి స్వాగతం… సుస్వాగతం
అన్న బ్యానర్ ను చదివి పిల్లలంతా ఒకరిమొకాలు ఒకరు చూసుకున్నారు…!
ఉపాధ్యాయుల్లా తయారై వచ్చిన విద్యార్థులైతే కొంత టెన్షన్ పడుతున్నారు .. పవన్ పరిస్థితి అదే…!
మనసులో కొంత అనుమానం ఉన్నా ..
ఈసారి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాల్సిందే అనుకుంటు ప్రార్థన కోసం కట్టిన లైన్లో నిలుచున్నాడు పవన్…!
తరగతి గదుల్లో విద్యార్థులే టీచర్లుగా విద్యాభోధన ప్రారంభమైంది…!
టీచర్లందరూ పిల్లలు పాఠాలు చెప్పడాన్ని గమనిస్తున్నారు…!
అందరి మెదళ్లలో మోహనే మెదులుతుండగా మొదటి పీరియడ్ అయిపోయింది…!
అయినా మోహన్ ఎక్కడా కనపడక పోవడంతో అందరిలో ఆసక్తి పెరిగింది.. !
రాములు సార్ మొకంలో టెన్షన్ పెరిగింది…!
లంచ్ టైమ్ తర్వాత ఎమ్మెల్యే గారు స్కూలుకు వస్తున్నట్టు అందరికీ తెలిసిపోయింది…!
ఎక్కడా కనపడకపోవడంతో మోహన్ గురించి టెన్షన్ పడుతూ వాకబు చేయడం మొదలుపెట్టారు రాములు సార్..!
ఆ టెన్షన్ లోనే మరో విద్యార్థి ప్రసాద్ ను తీస్కొని తన స్కూటర్ మీద బయటకు పోయిండు రాములు సార్ …!
గంట తర్వాత….
అప్పటిదాకా మోహన్ గాడు రాడు…. ఇవాళ ఫస్ఠ్ ప్రైజ్ తనదే అని ఆనందపడుతున్న సమయంలో ఒక్కసారిగా నీట్ గా తయారై స్కూల్ గేట్ దగ్గర కనపడ్డ మోహన్ చూసి పవన్ లో ఆందోళన మొదలైంది…!
అంత శుభ్రమైన బట్టలు అంతకుముందెప్పుడూ వాడు వేసుకోలేదు.. అవి ఇప్పటికిప్పుడు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు పవన్ కు….!
అసలేం జరిగిందో తెలుసుకుందామని ప్రసాద్ ను కలవడానికి పోయిండు పవన్…!
***
సగం కూలిపోయిన ఇంట్లోకి వెళ్లి చూస్తే ఎవరూ కనపడలేదు…!
పశువుల పాకలో పెండ ఎత్తుతూ కనిపించిండు గంగయ్య…!
బడికి పోతా .. రాములుసారు ఇయ్యాల తప్పకుండ రమ్మన్నడు అని బతిమాలుడుతున్నా ..
రాతిరి నుంచి పాణం మంచిగ లేక …
ఊర్లె పాలు పొయ్యడానికీ నా బదులు వాన్ని పంపిన.. మీరిచ్చిన సైకిల్ మీదనే పోయిండు అని చెప్పిండు గంగయ్య..!
ఇప్పుడెలా అని ఆలోచిస్తుంటే ఖాళీ పాల డబ్బాల శబ్దం వినరావడంతో రాములు సార్ మొకం వెలిగిపోయింది…!
మోహన్ ను తీసుకొని స్కూలుకు పోదాం అని అనుకుటుంటే..
“సార్ ఇవాళ ఒక్కరోజు నేను రాను సార్ ” అన్నడు మోహన్….!
“అదేందిరా….నీ గురించి మీ ఇంటికి వస్తే రానంటవేంది… నువ్వు రావాల్సిందేరా.. “
గట్టిగనే చెప్పిండు రాములు సార్
నాకూ రావాలనే ఉంది…
కాకపోతే ఇయ్యాల ఎమ్మెల్యే వస్తుండట..
గాయన ముందర నేను గిట్ల వచ్చి పాఠం చెపితే .. ఏమనుకుంటరో సార్ “
అన్నడు తన మాసిపోయిన బట్టల వైపు చూస్కుంట…!
ఒక్క క్షణం కిందికి మీదికి చూసి వాళ్లింటికి తోల్కపోయి శుభ్రంగా ఉన్న వాళ్ల అబ్బాయి షర్ట్.. ప్యాంట్ ఇచ్చి వేసుకొమ్మని చెప్పిండు సార్ …!
అవి అతికినట్టు సరిపోవడంతో సారే వాన్ని బడికి తోల్కవచ్చిండని ప్రసాద్ చెప్పడంతో రాములు సార్ మీద కోపం వచ్చింది పవన్ కు…!
నిలదిద్దామన్నంత కోపం వచ్చి సార్ దగ్గరికి పోతుంటే ఎమ్మెల్యే వచ్చే హడావిడి మొదలైంది…!
లంచ్ తర్వాత ….
ఎమ్మెల్యే గారు చూస్తుండగా మొదటగా పాఠం చెప్పడానికి వాన్నే పిలవడంతో ఈసారి కూడా ఫస్ట్ ప్రైజ్ వాందే అని నిర్ణయించుకున్నారు అందరూ…!
పవన్ చెప్పిన ఇంగ్లీష్ తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు చెప్పిన పాఠాలను విన్న ఎమ్మెల్యే గారు… అందరినీ మెచ్చుకొని బహుమతుల ప్రధానం చేయడానికి సిద్దమయ్యారు…!
ముందుగా ఎవరిని పిలుస్తారు..
ఫస్ట్ ప్రైజ్ ఎవరిదో అన్న టెన్షన్ అందరిలో మొదలైంది..!
అనుకున్నట్టే ముందు మోహన్ ను స్టేజీ మీదికి పిలిచారు రాములు సార్ ….!
వాన్ని చూపిస్తూ.. ఎమ్మెల్యే తో ఏదో చెప్పడం… ఆయన వాన్ని దగ్గరికి తీసుకొని మెచ్చుకొని సీల్డ్ కవర్ అందివ్వడంతో అదే ఫస్ఠ్ ప్రైజ్ అనుకున్నారు అంతా…!
కానీ…
ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పిన విద్యార్థులందరిని పిలిచి అలాంటి కవర్లే ఇవ్వడంతో
విద్యార్థులందరూ ఆశ్చర్యపోయారు…!
ఎమ్మెల్యే గారికి శాలువా కప్పి సన్మానం చేసిన తర్వాత…. అందరూ లేచి వెళ్లిపోతుండగా…
“ఎమ్మెల్యే గారూ … మీరు అనుమతిస్తే మా విద్యార్థులందరిదీ ఒక విన్నపం” అని రాములు సార్ వినమ్రంగా అడగడంతో అలాగే కూచుండి పోయారు …!
మా హైస్కూల్ విద్యార్థులు అందరూ సహజంగానే తెలివి వంతులు.. అందుకు నిదర్శనం మా విద్యార్థులు చక్కగా పాఠాలు చెప్ఫడం మీరూ చూశారు ..!
మొత్తం నూటయాభై మంది విద్యార్థులకు ఉపాధ్యాయులుగా మేమున్నది నలుగురమే.. అందులో ఒకరు వ్యాయామ ఉపాధ్యాయుడు.. మా పిల్లలు చెప్పిన ఆ సబ్జెక్టులకు ఇక్కడ ఉపాధ్యాయులే లేరు…!
విద్యార్థులందరూ వాళ్లకు వాళ్లే ఆ పాఠాలు చదువుకొని ఇంతలా నేర్చుకున్నారు .. !
అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉంటే వీళ్లు చక్కగా రాణించి మంచి ర్యాంకులు సాధిస్తారు…
సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత మీకు చెప్పాల్సిన అవసరం లేదు …ఎందుకంటే మీరు టీచర్ గా రిటైరయ్యే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు..
త్వరలో ..మీరు విద్యాశాఖ మంత్రిగా కాబోతున్నట్లు వింటున్నాం.. …!
స్వార్థం అనుకోకపోతే ….
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీదృష్టికి ఈ విషయాన్ని విన్నవించడానికే మీకీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం.. మీరు దానికి అంగీకరించడం జరిగింది ” అంటూ రాములుసారు మాట్లాడుతుంటే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు..!
నా తదుపరి కర్తవ్యం ఇదే..
ఖచ్చితంగా త్వరలోనే నెరవేరుస్తా అని హామీ ఇచ్చి వెళ్లిపోయారు ఎమ్మెల్యే గారు…!
పిల్లలందరూ రాములు సార్ పాదాలకు దండం పెడుతూ ఇంటి బాట పట్టారు…!
అందరూ వెళ్లి పోయాక..
పవన్ ఒక్కడే గ్రౌండ్లో నిలబడ్డడు…!
“పోయినసారి ఫస్ట్ ప్రైజ్ మోహన్ గాడికి ఇవ్వకుంటే వాడు ఈ సంవత్సరం బడికే వచ్చేటోడు గాదు… వాళ్లయ్య బర్లు కాసే పనిలో పెడుతుండె..
వాడు ఏది చదివినా ఇట్లే నేర్చుకుంటడు..
తెలివిగల్ల పోరడు ..
పేదరికంతో చదువుకు దూరం కావద్దని..
నేనే సైకిల్ కొనిచ్చిన్రా … ఆ విషయమే స్టేజీ మీద ఎమ్మెల్యే కు చెప్పిన” అని వెనుక నుంచి వచ్చి తల నిమురుతూ చెప్పిండు రాములు సారు…!
‘మీ అందరికీ తలా వెయ్యి రూపాయలు ఇమ్మని ఇచ్చింది కూడా ఎమ్మెల్యే గారే.. వారి పుణ్యాన మన స్కూలుకు మంచి సార్లు వస్తే మనందరికీ ఆనందమే కద రా” అని జబ్బ తట్టి ముందుకు పోతుంటే……
ధనవంతులూ..
పేదవారు ఎవరైనా సరే ..
పిల్లలందరూ చదువుకోవాలని తాపత్రయపడే రాములు సారు లాంటి గురువు మాకుండడం మా అదృష్టం అనుకొని కాళ్లకు నమస్కారం చేసిండు పవన్…

*ఏవి తల్లీ ! నిరుడు వెలిగిన మెండు* *చదువులు*
*ఏరి తల్లీ! విద్దె గరపిన దొడ్డ* *గురువులు…*
*గీత మార్చిన ఆచార్యులెక్కడ?*
*ఈదనేర్పిన వాచస్పతులెక్కడ ?*
*గురువులందు మాన్య గురువులేరి!* *తల్లీ!!*
– వాసాలమర్రి నాగరాజ..