
భారీ వర్షాలతో అతలాకుతలమైన సిరిసిల్ల పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కు ప్రజలు ఝలక్ ఇచ్చారు. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు సిరిసిల్ల పట్టణమంతా వరదమయమైందని, నీళ్లన్నీ వెళ్లిన తర్వాత మీరు వస్తే ఎలా? అని నిలదీశారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను ఏకరువు పెట్టారు. వారి సమస్యలన్నింటినీ సావధానంగా విన్న కేటీఆర్.. ఎన్నడూ పడనంత వర్షం పడిందని కొంచెం సంయమనం పాటించాలన్నారు. బాధలు అనుభవిస్తేనే తెలుస్తాయా? అని ప్వ్యారశ్ఖ్యానించారు. వచ్చే వర్షాకాలం నాటికి ముంపు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. శాంతినగర్ కార్మిక వాడలో వరద బాధితులను పరామర్శించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. వరద నీటిలోనే నడుచుకుంటూ వెళ్లి.. పరిశీలించారు. అక్కడికే అధికారులను పిలిపించి మాట్లాడారు.
వరద నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. వరద నీటిలోనే నడుచుకుంటూ ఇంటింటికీ వెళ్లిన కేటీఆర్.. ఎంత డబ్బు ఖర్చయినా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇళ్లు కూలిపోయిన పలువురు తమ గోడు వెళ్లబోసుకోగా పరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్లు లేని వారికి దసరా కల్లా డబుల్ బెడ్ రూంలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టరేట్లోని తన చాంబర్లో వరద పరిస్థితిపై జిల్లా యంత్రాంగంతో కేటీఆర్ సమీక్షించారు. సిరిసిల్ల కేంద్రంలోని కొత్త చెరువు నీటిని మానేరులో కలిసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. వరదల దాటికి వేములవాడలో కూలిపోయిన బ్రిడ్జిని శివరాత్రి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.