
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం స్కాట్లాండ్ తో జరిగిన పోటీలో రెండు వికెట్లు తీసి శ్రీలంక మాజీ స్టార్ పేసర్ లసిత్ మలింగను (84 మ్యాచుల్లో 107 వికెట్లు) అధిగమించాడు.
2007 నుంచి ప్రతి టీ 20 ప్రపంచకప్లో ఆడుతున్న షకీబ్ మరోసారి తన జట్టు కోసం అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, షకీబ్ ఖాతాలో 106 వికెట్లు ఉన్నాయి. నిన్న మ్యాచ్ లో మరో రెండు వికెట్లు పడగొట్టి లెజెండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మలింగ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రెండు వికెట్లతో షకీబ్ బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లో తన 600 వికెట్లను పూర్తి చేశాడు. ఈ మైలురాయిని చేరుకున్న మొదటి బంగ్లాదేశ్ బౌలర్ గా షకీబ్ నిలిచాడు. 362 వ మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఏ బంగ్లా బౌలర్ కూడా 400 వికెట్లు తీసుకోలేదు. రెండవ స్థానంలో వెటరన్ పేసర్ మష్రఫే మోర్తాజా ఉన్నాడు. అతను 308 మ్యాచ్ ల్లో 389 వికెట్లు సాధించాడు.
షకీబ్ ప్రస్తుతం 89 టీ 20 ఇంటర్నేషనల్ పోటీల్లో 108 వికెట్లు సాధించాడు. ఈ ఫార్మాట్ లో 100 కంటే ఎక్కువ వికెట్లు, 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్ గా షకీబ్ నిలిచాడు. వికెట్ల విషయానికొస్తే, రెండవ స్థానంలో ఉన్న మలింగ 84 మ్యాచ్ ల కెరీర్లో 107 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ కు చెందిన టిమ్ సౌథీ 83 మ్యాచ్ ల్లో 99 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ షాహిద్ అఫ్రిది 99 వికెట్లతో నాల్గవ స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 95 వికెట్లతో ఐదవ స్థానంలో ఉన్నారు.