
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’. మహేశ్ వి.మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. ఆయుష్ శర్మ కీలకపాత్ర పోషించాడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సల్మాన్ ఖాన్ సిక్కు పోలీసు అధికారిగా ఇందులో కనిపించారు.
ట్రైలర్ ఓపెన్ చేస్తే…’మహా భారతంలో హీరో ఎవరో తెలుసా’’ అని షాయాజీ షిండేను సల్మాన్ అడగ్గా, ‘’అర్జున్’’ అని అంటాడు. ‘’కాదు కృష్ణుడు’ అంటూ సల్మాన్ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. ‘నిన్ను గూండా అని పిలవను. కానీ, గూండాకా బాప్ ఈ పోలీస్వాలా’’, ‘’నీకు తెలుసా?నేను పుణెకు భాయ్‌ని’’ అని ఆయుష్ శర్మ అంటే, ‘’నువ్వు పుణెకు కొత్తగా భాయ్వి అయి ఉండవచ్చు. నేను ఎప్పటి నుంచో హిందుస్థాన్ మొత్తానికి భాయ్‌ని’’ అంటూ సల్మాన్ చెప్పే డైలాగ్స్ విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేసేశారు. సల్మాన్ కేవలం 30 నుంచి 35 రోజుల మాత్రమే షూటింగ్లో పాల్గొనడం మరో విశేషం.