
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అన్ని పార్టీలు తమ తమ రాజకీయ వేడిని చూపిస్తున్నాయి. ఎవరికి వారే గెలుపు మాదంటే మాది అనే ధీమాతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మణికం ఠాగూర్ సమావేశం అయ్యారు.

సీఎల్పీ కార్యాలయంలో వద్ద మీడియా తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు.హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అన్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. మంత్రి హరీశ్ రావును కేసీఆర్ శాశ్వతంగా ఇంటికి పంపే ప్లాన్ చేశారని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత హరీశ్ కు మిత్రద్రోహి అనే టైటిల్ మాత్రమే మిగులుతుందని చెప్పారు. టీఆర్ఎస్ లో తిరుగుబాటు జరిగే ప్రమాదం ఉందని… అందుకే కేసీఆర్ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారని అన్నారు. కేసీఆర్ చాలా అసహనంగా ఉన్నారని చెప్పారు. అందుకే ఆయన విపక్షాలు కుక్కలు, నక్కలతో పోల్చుతున్నారని విమర్శించారు.