
తెలంగాణలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా కొంతమందిని తప్పించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకు విపరీతంగా మద్యం అమ్మకాలు జరపడమే కారణమని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం వ్యసనపరులకు స్వర్గధామంగా మారిందని ఆయన విమర్శించారు. సైదాబాద్ లో చిన్నారి హత్యాచారం ఘటనలో ప్రభుత్వం ఇప్పటి వరకు నిందితుడిని పట్టుకోలేక పోయిందంటే, ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థలు ఎంత చేతగానితనంతో వ్యవహరిస్తున్నాయో అర్థమవుతోందని ఆయన అన్నారు. సైదాబాద్ నిందితుడి విషయంలో మంత్రి కేటీఆర్ ఐదు రోజుల క్రితమే తప్పుడు సమాచారంతో ట్వీట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కేటీఆర్కు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారి ఎవరో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.