
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఒక వేళ ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్ తోపాటు కిషన్ రెడ్డికే ప్రమాదమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే వారిలో వారికి పడడం లేదన్న ఆరోపణలున్నాయని తెలిపారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన ఆయనకు వరంగల్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంతో పోరాటం అని కేసీఆర్ చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధమని అన్నారు. యూపీ ఎన్నికల కోసమే మోదీ, అమిత్ షా కేసీఆర్‌ను దగ్గరకు తీస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా పెట్టకపోవడం వెనుక కారణం ఇదేనని చెప్పారు. అసలు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తొలిసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కేసీఆరే ప్లైట్ అరేంజ్ చేశారని తెలిపారు.
హుజూరాబాద్ ఎన్నికల తర్వాత పెద్ద బకరా కాబోతున్నది మంత్రి హరీశ్ రావే అని రేవంత్ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు హరీశ్ ను కేసీఆర్ వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. రానున్న ఉప ఎన్నికలో ఓడిపోయారన్న కారణం చూపి హరీశ్ రావును పార్టీకి దూరం చేసే అవకాశం సైతం ఉందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.