
గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న మూడుచింతలపల్లిలో రెండు రోజుల దీక్ష చేపట్టింది. నిన్న మొదలైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దీక్ష రెండోరోజు కూడా కొనసాగుతోంది. ఈ ఉదయం దళిత కాలనీలో దళితులతో సమావేశమైన రేవంత్, వారితో మాట్లాడారు. ఉదయం దళిత వాడలో రచ్చబండ నిర్వహించి దళితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొదట కాలనీ అంతా తిరిగి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కొందరి ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు వారి ఊరి సమస్యలను రేవంత్ రెడ్డికి వివరించారు.
వర్షం వస్తే ఇందిరమ్మ కాలనీ ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని, కాలనీ కంటే అయిదారు అడుగులు ఎత్తున రోడ్డు వెయ్యడం వల్లనే వర్షపు నీరు ఇళ్లలోకి వస్తున్నట్లు తెలిపారు. పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడు ఎకరాల భూమి, ఉద్యోగాలు, పట్టాదారు పాసుబుక్కులు తదితర అంశాలపై రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వెంటనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ కు ఫోన్ చేసి మూడు చింతలపల్లి సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు.
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో పెట్టిన పార్టీని.. ఉద్యమం ముసుగులో బలోపేతం చేసుకుని… ప్రయోజనం పొందారని ఆరోపించారు. ‘నీళ్లేమో జగన్ రెడ్డి తీసుకుపాయె.. నిధులేమో నీ జేబులోకి పాయె.. నియామకాలేమో నీ ఇంటికి వచ్చె.! తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది…’ అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.