
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఘాటైన పదజాలంతో కేసీఆర్ ను విమర్శిస్తున్న రేవంత్ పై టీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు ఇప్పటికే బదులిచ్చారు. తాజాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ పై రేవంత్ మాట్లాడుతున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల దృష్టికి తీసుకెళ్లామని, ఈ విషయమై వాళ్లిద్దరికీ లేఖలు రాశామని చెప్పారు.
రేవంత్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో ఎవరూ తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న సత్యాన్ని రేవంత్ గ్రహించారని, అందుకే తన నోటికొచ్చినట్టు కేసీఆర్పై, ఆయన కుటుంబంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను ఢీ కొట్టే స్థాయి రేవంత్ కాదని, రేవంత్ శృతి మించితే ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు.