
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లి అభివృద్ధిపై తాను చెప్పిన మాటలు తప్పయితే ముక్కు నేలకు రాసి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ లక్ష్మాపూర్, కేశవాపూర్, మూడుచింతలపల్లి గ్రామాలను దత్తత తీసుకుని నాలుగేళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఏం జరగలేదని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలోని కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లి లో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..2015లో సీఎం దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్ గ్రామంలో 150 కుటుంబాల ప్రజలు ఇంకా రోడ్ల మీద బతుకుతున్నారని అన్నారు. లక్ష్మాపూర్ గ్రామంలో ప్రారంభించిన ధరణి వెబ్ సైట్ లోనే లక్ష్మాపూర్ లేదన్నారు. ఏడున్నర ఏళ్లుగా కేసీఆర్ చేపట్టిన పనుల వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించడానికే రెండు రోజుల దీక్ష చేపట్టినట్లు వివరించారు. తాను గ్రామాలకు రాకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేతలు పన్నాగం పన్నారన్నారు. ఫామ్ హౌస్ పక్కకు వచ్చి ఈ విమర్శలకు సమాధానం చెప్పేందుకే తాను ఇంతకాలం నోరు తెరవలేదన్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న ఈ గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ జెండాకే అండగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.