
మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ఒకటి ‘విక్రమార్కుడు’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించాడు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో రవితేజ నట విశ్వరూపం చూపించాడు. ఇందులో ‘జింతాతా జితా జితా .. ‘ అనే రవితేజ మ్యానరిజాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ సినిమాను అన్ని భారతీయ భాషల్లోకి అనువదించగా… ప్రతి చోటా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకాలానికి సీక్వెల్ కథ రెడీ చేశారట రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ సీక్వెల్‌కి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు లేవని అంటున్నారు. వేరే హీరోల సినిమాలతో రాజమౌళి బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కథను వేరే దర్శకుడికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ దర్శకుడెవరనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. ఇక విజయేంద్ర ప్రసాద్‌కి దర్శకుడు పూరి జగన్నాథ్ గానీ, ఆయన మేకింగ్ స్టైల్ గానీ బాగా ఇష్టం. కాబట్టి ‘విక్రమార్కుడు’ సీక్వెల్ కథను పూరీకే ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తీసుకురావాలని… పర్యవేక్షణ బాధ్యతలను రాజమౌళికే అప్పజెప్పాలని రవితేజ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’, ‘రామారావు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.