
మాస్ మహారాజా రవితేజ 71వ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రస్తుతం రవితేజ ఖాతాలో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు రవితేజ. గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో మాస్ మహారాజా నటించబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈరోజు రవితేజ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. రవితేజ 71వ చిత్రంగా “టైగర్ నాగేశ్వర రావు” రూపొందనుంది. ఈ మేరకు ప్రీ లుక్ ను రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
#TigerNageswaraRao pic.twitter.com/jWUKmM5iEq
— Ravi Teja (@RaviTeja_offl) November 3, 2021
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ‘అక్కడ దొంగలు, దోపిడీదారులు ఉండేవారు. అదే విధంగా టైగర్ నాగేశ్వరరావు కూడా’ అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. స్టువర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకడు. అతని తెగింపునకు గుర్తుగా ‘టైగర్’ పేరుతో పిలిచేవారు. 1970 దశకంలో అధికారులకు నాగేశ్వరరావు ముచ్చెమటలు పట్టించాడు. చిక్కినట్టే చిక్కి తప్పించుకునేవాడు. ఒకానొక సమయంలో చెన్నై జైలు నుంచి కూడా తెలివిగా తప్పించుకున్నాడు. 1987లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.