
రవిశాస్త్రి ఒక కామెంటేటర్, టీం ఇండియా కి హెడ్ కోచ్ గా పని చేసిన వ్యక్తి.. ఈ మధ్యనే టీం ఇండియా కోచ్ గా పదవి విరమణ చేశాడు ఈ క్రికెట్ దిగ్గజం. అందరితో కలుపుగోలుగా సరదాగా వుండే వ్యక్తి ఈయన. అందరితోనూ కలివిడిగా ఉండే ఆ నైజమే టీమిండియా కోచ్ గా ఇన్నేళ్ల పాటు కొనసాగేందుకు కారణమైంది. కాగా, రవిశాస్త్రిపై సోషల్ మీడియాలో ఆటగాళ్ల కంటే మిన్నగా మీమ్స్ వస్తుంటాయి. టీమిండియా ఓడిపోయిన సమయాల్లో రవి శాస్త్రిని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ జరుగుతుంటుంది. శాస్త్రి పై వచ్చే మీమ్స్ లో కొన్ని విపరీతమైన నవ్వు పుట్టిస్తుంటాయి.
తాజాగా ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ, తనపై వచ్చే మీమ్స్ ను తాను కూడా ఎంజాయ్ చేస్తుంటానని వెల్లడించారు. తనపై కామెడీ చేస్తూ వచ్చే మీమ్స్ పట్ల అభ్యంతరం చెప్పబోనని, అలాంటి మీమ్స్ చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటానని తెలిపారు. “మనసు బాగోలేనప్పుడు మీమ్స్ ద్వారా వీళ్లు చక్కగా నవ్విస్తుంటారు. మీమ్స్ రూపొందించడం కూడా ఓ కళే. వాళ్లలో కొందరితో సరదాగా మందు కొట్టాలనుంది” అంటూ తన మనోభావాలను పంచుకున్నారు.