
రైతుల సుదీర్ఘ పోరాటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలవంచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని మోదీ ప్రకటించడంతోపాటు రైతులకు క్షమాపణ చెప్పడం రైతులు, ప్రజలు, వామపక్షాలతోపాటు ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి విజయమన్నారు. ఇది మోదీ వెనక్కి తగ్గడం మాత్రమే కాదని, ఆయన వెనుక ఉన్న కార్పొరేట్లు కూడా వెనక్కి తగ్గినట్లేనని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని మోదీ ప్రకటించడంతోపాటు రైతులకు క్షమాపణ చెప్పడంపై సీపీఐ విజయవాడ నగర సమితి అధ్వర్యాన స్థానిక లెనిన్ సెంటర్లో విజయోత్సవం నిర్వహించారు.
రామకృష్ణతోపాటు అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు రావుల వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాపోరాటాలకు మోదీతోపాటు ఎవరైనా తలవంచాల్సిందేనని, ఇందుకు రైతు ఉద్యమం సాధించిన విజయమే నిదర్శమని చెప్పారు. రైతు ఉద్యమ స్ఫూర్తితో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం మరింత పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామన్నారు. దశాబ్దాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టే సీఏఏ, ఎన్ఆర్సీలను కూడా రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 702 రోజులుగా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని గౌరవించి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రావుల వెంకయ్య మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని మోదీ ప్రకటించడంతోపాటు రైతులకు క్షమాపణ చెప్పడం పాక్షిక విజయం మాత్రమేనని అన్నారు. రైతులతోపాటు దేశ ప్రజలందరిపై పెనుభారం మోపనున్న విద్యుత్ సంస్కరణల బిల్లుతోపాటు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు పార్లమెంట్లో ప్రకటించిన తర్వాతే సంపూర్ణ విజయం సాధించినట్లు అని చెప్పారు. అప్పటి వరకు రైతు సంఘాల సమన్వయ కమిటీ అధ్వర్యాన ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీకి రైతు ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడలో కూడా భారీ ప్రదర్శన చేపడతామన్నారు. దోనేపూడి శంకర్ మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాలకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయని ప్రశ్నించారు.
రైతు ఉద్యమంలో అమరులైనవారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యుడు లంక దుర్గారావు, కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, తాడి పైడయ్య, సంగుల పేరయ్య, కె.వి.భాస్కరరావు, నక్కా వీరభద్రరావు, తూనం వీరయ్య, కె.ఆనందరావు, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాణి, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓర్సు భారతి, పంచదార్ల దుర్గాంబ, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు మూలి సాంబశివరావు, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకుడు ఆర్.పిచ్చయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, ఉపాధ్యక్షుడు జాన్సన్‌బాబు, సీపీఐ శాఖ కార్యదర్శులు పడాల పెదబాబు, జి.వెంకట్రావు, పగిడికత్తుల రాము, గాడు దుర్గారావు, కంది ఆదినారాయణ, డి.సూరిబాబు, రాయన గురునాథం, బియ్యపు కృష్ణారావు, కొండేటి శ్రీనివాసరావు, కొండ, దుర్గాసి రమణమ్మ, తమ్మిన దుర్గ తదితరులు పాల్గొన్నారు.
నాయకుల హర్షం
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని మోదీ ప్రకటించడంతోపాటు రైతులకు క్షమాపణ చెప్పడంపై రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు, ప్రముఖ సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. రైతులతోపాటు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమాన్ని గౌరవించి మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకుని అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించాలని డిమాండ్ చేశారు.