
పంజా వైష్ణవ్ తేజ్, అందాల రకుల్ హీరో హీరోయిన్ లు గా క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా గురించి రకుల్ ముచ్చటించింది. ‘కొండపొలం’ సినిమాలో గ్రామీణ ప్రాంత అమ్మాయిగా, గొర్రెలు కాసే యువతిగా నటించడం మరిచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చిందని చెప్పింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దర్శకుడు క్రిష్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది. ఈ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. నల్లమల అడవుల్లో గొర్రెల కాపరుల జీవితాల నేపథ్యంగా తెరకెక్కింది ‘కొండపొలం’ సినిమా. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి స్వరకల్పన చేశారు.
”ఈ సినిమాలో తలపాగా, గొర్రెలతో ఉన్న నా లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. రెండో సినిమాలోనే ఇలాంటి క్యారెక్టర్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో మేం మాట్లాడే యాస కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ‘కొండపొలం’ యాక్షన్, అడ్వెంచర్, లవ్ తోపాటు మంచి మెసేజ్ ఇచ్చే సినిమా. రకుల్ చాలా ఫాస్ట్ గా తన సీన్ పూర్తి చేసేది. ఆమెను చూసి నేను ఎలా చేయాలా అని భయపడేవాడిని. ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా తనకు తెలుగు సరిగా రాకపోయినా.. ఆ యాసలో మాట్లాడటం చాలా గ్రేట్. కష్టమైన పదాలను కూడా ఆమె నేర్చుకొని చెప్పేది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. రెండో సినిమాకే క్రిష్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయనకు కృతజ్ఞతలు. ఈ చిత్రం, అందులోని నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది…” అని వైష్ణవ్ తేజ్ తెలిపాడు.
“ఈ సినిమాలోని యాస మాట్లాడటం అంత ఈజీ కాదు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. రెస్పాన్స్ బాగా వస్తుంది. నాది చాలా మంచి పాత్ర. ఎంతో ప్రేమగా ఉంటుంది. ఈ రోల్ లో నటించేందుకు గొర్రెల కాపరి వాళ్ల వీడియోలను చూశా. వారి బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నా. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూసి ఉండరు. దర్శకుడు క్రిష్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా తెలివైన వ్యక్తి. తన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. మళ్లీ మళ్లీ ఆయనతో సినిమాలు చేయాలని ఉంది.” అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.