
సూపర్ స్టార్ రజినీ కాంత్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. రజనీకాంత్ గురువారం ఆస్పత్రికి వెళ్లినట్టు సమాచారం. 70 ఏళ్ల రజినీకాంత్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడానికి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు.
దేశ రాజధానిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలను కలుసుకున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే రజినీకాంత్ ను హాస్పిటల్ కు తీసుకొచ్చామని ఆయన భార్య తెలిపారు. ఏటా రజనీకాంత్ కు ఇక్కడ బాడీ చెకప్ చేయిస్తామని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. రజినీతోపాటు ఆయన సోదరుడు కూడా హాస్పిటల్ కు వెళ్లినట్లు సమాచారం. పూర్తి బాడీ చెకప్ తర్వాత ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం రజినీకాంత్ ను ఇంటికి పంపిస్తామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘పెద్దన్న’ (తమిళంలో ‘అన్నాత్తే’) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ చిత్రం దిపావళి సందర్భంగా విడుదల కానుంది. తాజాగా రజినీకాంత్ తన భార్య, కుమార్తెలు తదితర కుటుంబ సభ్యులతో కలిసి ‘అన్నాత్తే’ సినిమా చూశారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కుష్బు, మీనా, కీర్తి సురేష్, సూరి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సినిమాస్, డి.సురేష్ బాబు పంపిణీ చేయనున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.