
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జగన్ కు కంట్లో నలుసులా మారిన ఆయన.. ఏకంగా వైసీపీ అధ్యక్ష పదవికే పోటీ చేస్తానని ప్రకటించారు. వెంటనే పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
పార్టీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చు. ఓ క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈసారి అధ్యక్ష పదవికి నేను పోటీలో ఉంటా. సంస్థాగత ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. నేను క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టే నన్ను పార్టీ నుంచి తొలగించలేదు. సొంత పార్టీ నేతలే నాపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా గెలుపుపై కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా.. తనపై దాఖలైన అనర్హత పిటిషన్ ను వెంటనే కొట్టివేయాలని కోరుతూ రఘురామ.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.