
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ క్వింటన్ డి కాక్ తన సహచరులకు క్షమాపణలు చెప్పాడు. తాను జాత్యహంకారిని కాదని డికాక్ స్పష్టంచేశాడు. తనపై ఆ ముద్ర వేయడం ఎంతో బాధించిందని తెలిపాడు. తన చర్యలవల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని సహచర జట్టు సభ్యులను, అభిమానులను కోరాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’కు మద్దతిస్తానని ప్రకటించాడు. తాను మోకాలిపై నిలుచోవడం ద్వారా ఆ ఉద్యమంపై అవగాహన కల్పించవచ్చని భావిస్తే అందుకు తాను సిద్ధమన్నాడు. వివరాల్లోకి వెళితే..
టీ20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ జరగడానికి ముందు మోకాళ్లపై కూర్చుని బీఎల్ఎంకు మద్దతు తెలపాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆటగాళ్లకు ఆదేశాలు అందాయి. అయితే, ఆ ఉద్యమానికి మద్దతు తెలపడం ఇష్టంలేని డికాక్ ఏకంగా మ్యాచ్‌కే దూరమయ్యాడు. అంతకుముందు కూడా డికాక్ ఓ మ్యాచ్‌లోనూ ఇలానే ప్రవర్తించాడు. ఉద్యమానికి మద్దతు తెలపకుండా నిలబడ్డాడు. తాజాగా మరోమారు అతడి ప్రవర్తన వివాదాస్పదం కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు అతడి క్రికెట్ భవితవ్యం కూడా సందిగ్ధంలో పడింది. దీంతో దిగొచ్చిన డికాక్.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో మాట్లాడాడు. అనంతరం విచారం వ్యక్తం చేశాడు.
తన కారణంగా కలిగిన బాధకు, కోపానికి, గందరగోళ పరిస్థితులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నట్టు చెప్పాడు. ప్రపంచకప్‌లకు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంటున్నట్టే అనిపిస్తోందని, అది సరికాదని అన్నాడు. తనకు అండగా నిలిచిన జట్టు సభ్యులకు, ముఖ్యంగా కెప్టెన్ బవుమాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు.