
కన్నడ సినీ పరిశ్రమలో అగ్ర నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య ఇవాళ ఉదయం కన్నడ హీరోకు తుది వీడ్కోలు పలికారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో తల్లిదండ్రులు పార్వతమ్మ, రాజ్ కుమార్ సమాధుల వద్దనే పునీత్ అంతిమ సంస్కరాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. పునీత్ అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, యడియూరప్ప, సిద్ధరామయ్య, నటులు యశ్, సుదీప్, తదితరులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. పునీత్ రెండో సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు తెల్లవారు జామున 5 గంటల సమయంలో అంతిమయాత్ర జరిగింది. కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకూ భారీ కాన్వాయ్ మధ్య పునీత్ అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.
#WATCH | Mortal remains of Kannada actor Puneeth Rajkumar being carried to Sree Kanteerava Studios in Bengaluru, where his last rites will be performed today pic.twitter.com/xHyBYL6Rxt
— ANI (@ANI) October 31, 2021
మంత్రి బొమ్మై, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. గౌరవ సూచకంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పునీత్ భౌతిక కాయంపై ఉంచిన జాతీయ పతాకాన్ని భార్యకు అందించారు. పునీత్ రాజ్ కుమార్ను ఖననం చేస్తున్న సమయంలో భార్యాపిల్లలు, సోదరుడు శివ రాజ్ కుమార్ సహా ఇతర కుటుంబ సభ్యులు దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. తోటివారు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. పునీత్ భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచగానే.. ఆయన్ను చివరిసారి చూసేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. ఆ సమయంలో అక్కడున్న అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. పునీత్ రాజ్ కుమార్ అకాల మృతి దక్షిణాది సినీ పరిశ్రమనే కాదు అభిమానులను కూడా తీవ్ర విషాదంలో ముంచింది.