
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణం కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీనే కాక యావత్ దక్షిణాది సినిమా పరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టింది. పునీత్ చేసిన సినిమాల కంటే ఆయన చేసిన సామాజిక సేవలు అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. పునీత్ అకాల మరణంతో దక్షిణ భారతదేశమంతా బాధపడుతుంటే ఒక తాగుబోతు యువకుడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్లు గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..
పునీత్ రాజ్ కుమార్ మరణించాడని, అందుకోసమే బెంగళూరులో మూడు రోజులు మద్యం విక్రయాలు బ్యాన్ చేశారని ఓ నీచుడు రగిలిపోయాడు. బీర్ బీటిల్ చేతిలో పెట్టుకున్న ఆ వ్యక్తి… ‘‘రేపటి నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మద్యం తాగి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర..’’ అంటూ పిచ్చి వ్యాఖ్యలు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో కన్నడిగులు మండిపడుతున్నారు. బెంగళూరు నగర పోలీసు కమీషనర్ స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ విషయం ఎంత సీరియస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రముఖ హీరో కిచ్చ సుధీప్ కూతురితో పాటు వేలాది మంది నెటిజన్లు ఆ కిరాతకుడిని అరెస్టు చేసి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం సైబర్ క్రైమ్ వింగ్‌కు సమాచారం అందించారు. అలా పోలీసులు వెంటాడి వేటాడి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కమల్ పంత్ ట్వీట్ చేశారు. కాగా, పునీత్ మృతి నేపథ్యంలో నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. నెటిజన్ పోస్టుకు ఇదే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.