
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46) కన్నుమూశారు. ఈ ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో.. కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఐసీయూలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఉదయం 11:30 గంటల సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అంతకు ముందు వరకు చాలా హుషారుగా గడిపిన ఆయన.. అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంటనే కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, నటుడు యాశ్, నటి శృతి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.
పునీత్ కు గుండెపోటు వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఆందోళనతో ఉన్న అభిమానులు.. ఆయన మృతి వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. భారీగా ఆస్పత్రి వద్దకు చేరుకుని రోదిస్తున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం.. రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించింది. ఎక్కడికక్కడ దుకాణాలు, వ్యాపార సముదాయాలను మూసి వేయాల్సిందిగా ఆదేశించింది. ఆస్పత్రి పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దక్షణాది సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
పునీత్ రాజ్ కుమార్.. 1975 మార్చి 17న జన్మించారు. ఆయన.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు కావడం విశేషం. ఏడాది వయసు నుంచే బాలనటుడిగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు. 14 ఏళ్ల వయసు వరకు బాలనటుడిగా కొనసాగిన ఆయన.. 2002లో ఇడియట్ సినిమా కన్నడ వెర్షన్ ద్వారా హీరోగా రంగ ప్రవేశం చేశారు. తండ్రి వారసుడిగా ఆ స్టార్ డమ్ ను నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 29 సినిమాల్లో హీరోగా నటించిన ఆయనకు.. కన్నడ నాట లక్షలాది అభిమాన గణం ఉంది. ఆయన మరో ఇద్దరు సోదరులు కూడా కర్ణాటకలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. వీళ్ల కుటుంబానికి నందమూరి కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది.
నాటి ఎన్టీఆర్ నుంచి నేటి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇరు కుటుంబాల మధ్యా ఆ అనుబంధం అలాగే కొనసాగుతోంది. బాలకృష్ణ ఎప్పుడు హిందూపూర్ వెళ్లినా.. అటునుంచి అటు బెంగళూరు వెళ్లి రాజ్ కుమార్ తనయులు పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్ లను కలుస్తుంటారు. వాళ్లు కూడా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా బాలకృష్ణ ఇంటికి వెళుతుంటారు. ఆ సాన్నిహిత్యంతోనే ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా రాజ్ కుమార్ సోదరులు చురుగ్గా పాల్గొన్నారు.