
ప్రభాస్ ‘ఆదిపురుష్’ విడుదల తేదీపై చిత్రబృందం స్పష్టతనిచ్చింది. ఇంతకు ముందే చెప్పినట్లు వచ్చే ఏడాది ఆగస్టు 11నే రిలీజ్ చేస్తామని సోమవారం మరోసారి వెల్లడించింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 11నే త్రీడీలో విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్-రెట్రో ఫిలింస్ ప్రొడక్షన్ సంయుక్తంగా ‘ఆదిపురుష్’ ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాయి. దీనిని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపిస్తారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.
ప్రభాస్ మరో మూడు సినిమాలు కూడా చేస్తున్నాడు. అందులో ‘రాధేశ్యామ్’.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ‘సలార్’ షూటింగ్ దశలో ఉంది. ఇది కూడా వచ్చే ఏడాది ద్వితియార్ధంలో రిలీజ్ అయ్యే అవకాశముంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్టు-K'(వర్కింగ్ టైటిల్) లోనూ ప్రభాస్ హీరోగా చేస్తున్నాడు.