
(మా) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చిత్ర పరిశ్రమలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. ఒకవైపు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ‘మా’ ఎన్నికలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ, ఏపీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
‘మా’ ఎన్నికల్లోకి వైఎస్ జగన్ ను, కేసీఆర్ ను, బీజేపీని లాగుతారా అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. మంచు విష్ణుకు వైఎస్ జగన్ బంధువైతే ‘మా’ ఎన్నికలకు వస్తారా అని ప్రశ్నించారు. రెండు సార్లు హలో చెప్పినంత మాత్రాన కేటీఆర్ మిత్రుడైపోతారా అని కూడా అడిగారు. ఓట్ల సునామీలో మంచు విష్ణు ప్యానెల్ కొట్టుకుపోతుందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ‘మా’ ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టత ఇచ్చారు.
కాగా, ఈ నెల 10వ తేదీన మా ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను సినీ పరిశ్రమ వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ లు పోటీ చేస్తున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు సినీ నటుడు చిరంజీవి మద్దతు ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని నాగబాబు కూడా ప్రకటించారు. మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ కి బాలకృష్ణ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మంచు విష్ణు వెల్లడించారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ మంచు విష్ణు రెబెల్ స్టార్ కృష్ణం రాజును కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ..తనకు కృష్ణం రాజు ఆశీస్సులు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.