
‘‘పవన్ నన్ను పాలేరు అన్నారు. అవును.. షంషేర్ గా చెబుతున్నా.. నేను నిజంగానే ముఖ్యమంత్రి జగన్ కు పాలేరును. మరి నువ్వెవరికి పాలేరువు పవన్? కమ్మవారికి పాలేరువా?’’ అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. తనను అవమానిస్తే.. అంతకు మించి అవమానిస్తానని, నోరు జారితే.. వెంటనే వాత పెడతానని పవన్ ను హెచ్చరించారు. నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి తదితరులు ఎగ్జిబిటర్లతో కలిసి మచిలీపట్నంలోని ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రితో చర్చలు జరిపారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నానితో కలిసి పాల్గొన్నారు. బుధవారం జరిగిన జనసేన సమావేశంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. అద్దెకిచ్చేందుకే పార్టీ పెట్టిన ఘనుడు పవన్ కల్యాణ్ అని, షామియానాలు, కార్లను అద్దెకిచ్చినట్లు ఈయన పార్టీని అద్దెకిస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘‘పవన్.. నీకసలు సంస్కారముందా! మీ అమ్మ అంజనాదేవి నీకు నేర్పింది ఇదేనా! ముఖ్యమంత్రిని ఏరా, ఒరేయ్ అంటావా! పవన్ కల్యాణ్ ను నేను బూతులు తిట్టలేదు. కాబట్టే టీవీల్లో బీప్ లు లేకుండా ప్రసారం చేశారు. పవన్ వ్యాఖ్యలపై కొందరు సినీ పెద్దలు నాతో మాట్లాడారు. ఒకరి పిచ్చివాగుడుతో పరిశ్రమకు సంబంధం లేదన్నారు. చిరంజీవి కూడా ఫోన్ లో మాట్లాడారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై అభ్యంతరం ఉంటే.. పరిశ్రమ పెద్దలు వచ్చి మాట్లాడవచ్చు. చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందాం. అంతేగానీ, ఇలా ఎవరో ఒకరు పిచ్చి విమర్శలతో పరిశ్రమ ఇబ్బంది పడుతుంది. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత సినీ పెద్దలపైనే ఉంటుంది…’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆన్ లైన్ టికెట్ల విధానం సహా పరిశ్రమకు సంబంధించిన సమస్యలను సినీ పెద్దలు వివరించారని, వాటిని సీఎం దృష్టికి తీసుకువెళతానని మంత్రి చెప్పారు. పవన్ పిచ్చి వాగుడుతో సినీ పరిశ్రమకు సంబంధం లేదని వారు చెప్పారని, ప్రభుత్వం కూడా ఒక వ్యక్తి వాగుడును సీరియస్ గా తీసుకోబోదని తెలిపారు. ఆన్ లైన్ టికెట్ల ప్రతిపాదన సినీ పెద్దల నుంచే వచ్చిందని, ఈ దిశగా ప్రత్యేకంగా ఓ యాప్ ను రూపొందించే పనిలో ఉన్నామని వెల్లడించారు. సినిమా రంగానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోదని స్పష్టం చేశారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఆన్ లైన్ టికెట్ల ప్రతిపాదనను తామే తీసుకొచ్చామని, దీన్ని రాజకీయం చేయొద్దని కోరారు. ‘‘ఇటీవల జరిగిన ఘటనలతో పరిశ్రమకు ఇబ్బందులు వచ్చాయి. సినిమా పరిశ్రమ చాలా సున్నితమైంది. దీన్ని వివాదాల్లోకి లాగొద్దు. ఆన్ లైన్ టికెట్లలో పారదర్శకత తీసుకురావాలని మంత్రిని కోరాం’’ అని వివరించారు. మరో నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. ఆన్ లైన్ విధానం ద్వారా డబ్బు ప్రభుత్వం దగ్గర ఉండిపోతుందేమో అన్న భయం నిర్మాతల్లో ఉందని, ఇది ఎప్పటికప్పుడు నిర్మాతకు చేరితే సమస్యేమీ ఉండదని అన్నారు. నగదు చెల్లింపులు నిలిచిపోతే నిర్మాతలు, పరిశ్రమ ఇబ్బందులు పడుతుందన్నారు. ఈ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా థియేటర్లలో ఇప్పుడున్న 50 శాతం ఆక్యుపెన్సీని 100 శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.