
ఆంధ్ర ప్రదేశ్ సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తనలోని వైరాగ్యాన్ని ప్రదర్శించారు. “నాకు మంత్రి పదవి మీద ప్రేమా? ఎందుకు ఉంటుంది? ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియదు…’’ అంటూ మాట్లాడారు. మచిలీపట్నంలో రెండు రోజుల కిందట సినీ నిర్మాతలతో జరిగిన సమావేశం సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే మంత్రి వర్గాన్ని సీఎం జగన్ పూర్తిగా ప్రక్షాళన చేస్తారని, ఒకరిద్దరు మినహా దాదాపుగా అందరి పదవులూ ఊడడం ఖాయమనే కథనాలకు ఈ వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే మంత్రివర్గ ప్రక్షాళనపై ప్రకటన చేశారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల పనితీరును విశ్లేషించి.. సగం మందిని మార్చేస్తానని చెప్పారు. కానీ, ఇప్పుడు ఏకంగా మంత్రులందరికీ మంగళం పాడేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు ప్రాధాన్యం పెరిగింది.
ఇటీవల మరో మంత్రి, జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం పదవుల్లో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. మా పదవులకు గ్యారెంటీ లేదు. సీఎం జగన్.. మంత్రులందర్నీ తీసేయాలనుకుంటున్న మాట వాస్తవమే’’ అని ఆయన కుండబద్ధలు కొట్టేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. మంత్రి వర్గ ప్రక్షాళన త్వరలోనే ఉంటుందని వైసీపీ వర్గలు భావిస్తున్నాయి. దీంతో.. ఆశావహ ఎమ్మెల్యేలు అప్పుడే తమ ప్రయత్నాలు మొదలెట్టేశారని సమాచారం. జగన్ దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు పోటీలు పడుతున్నారు. చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేశ్ దాడి కూడా ఈ క్రమంలో జరిగిందేనని పరిశీలకులు భావిస్తున్నారు.