
శ్రమదానం పేరిట జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమానికి అడుగడునా పోలీస్ లు అడ్డుపడుతున్నారు. ఈ సందర్భంలో వైసీపీ నాయకులపై, ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో మీడియా తో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజకీయాలు తనకు సరదా కాదని, బాధ్యత అని అన్నారు.
వైసీపీ నేతలు అదే పనిగా తనను దూషిస్తున్నారని, తన సహనాన్ని తేలికగా తీసుకోవద్దని, తాట తీసి నార తీస్తానని హెచ్చరించారు. పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని, యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే మనిషిని కాదని, ఆయన అన్నారు. ఎన్నో ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చానని చెప్పారు. మనం కట్టే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయని, ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరని అన్నారు.
రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నానని పవన్ చెప్పారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా నిలబడేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. శ్రమదానం చేయడం తనకు సరదా కాదని చెప్పారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం సరికాదని అన్నారు. కులాల పేరుతో వైసీపీ నేతలు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండు ఇళ్లకే పరిమితం అంటే కుదరదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అణచివేత ధోరణి మంచిది కాదని అన్నారు. అన్ని కులాల్లో గొప్ప వ్యక్తులు ఉంటారని చెప్పారు.