
తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగు వారి సౌభాగ్యమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తన తరఫున, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగు భాష పట్ల వైసీపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు. పాలకుల అనాలోచిత చర్యల కారణంగా ‘తెలుగు’ వాడుక నుంచి కనుమరుగైపోయే ప్రమాదంలో పడిందని విచారం వ్యక్తం చేశారు.
ఓట్ల వ్యామోహంలో పడి కొట్టుకుంటున్నారే తప్ప ఎంతో ఘనకీర్తి ఉన్న తెలుగు భాషా పరిరక్షణకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఒకప్పుడు దేశంలో ‘తెలుగు’ రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడది ఐదో స్థానానికి పడిపోయిందని వివరించారు. తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య 27 శాతం మించి లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఐదు దశాబ్దాలలో తెలుగు భాష అంతరించిపోతున్న భాషల పట్టికలో చేరిపోయే ప్రమాదం ఉందని, ఈ విషయమై తెలుగు భాషాభిమానులు వ్యధ చెందు తున్నారని అన్నారు. మాతృభాషను పరిరక్షించుకోవడానికి తెలుగు వారందరూ నడుం కట్టాల్సిన అవసరం ఉందని పిలపు నిచ్చారు.