
సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే వైసీపీ నేతలు కాలిపోతారు జాగ్రత్త… అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ‘ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్..’ అని వ్యాఖ్యానించారు. వైసీపీ రిపబ్లిక్ అనుకుంటే జనం తిరగబడతారని హితవు పలికారు.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ హాజరయ్యారు. తన కారణంగా సినిమా పరిశ్రమను టార్గెట్ చేయడం ఎంతగానో బాధ కలిగిస్తోందని అన్నారు. ‘నా ఒక్కడి కోసం సినిమా పరిశ్రమ మొత్తాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. కావాలంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేసుకోండి. అంతేగాని సినిమా పరిశ్రమకు మాత్రం అన్యాయం చేయవద్దు..’ అని పవన్ కోరారు. పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని సినీ పెద్దలకు సూచించారు.
‘’సాయితేజ్ ప్రమాదానికి గురైతే చాలామంది సానుభూతి తెలిపారు. ఇదే సమయంలో మీడియాలో కొద్దిమంది నిర్లక్ష్యంగా వెళ్లాడని, ఎక్కువ వేగంతో వెళ్లాడని ప్రోగ్రామ్స్ చేశారు. అలా చేసే వ్యక్తులు కొంచెం కనికరం చూపించాలని కోరుతున్నా. ఇలాంటి కథనాల కంటే… వై.ఎస్.వివేకానంద రెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారో మాట్లాడితే బాగుంటుంది. కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ విమానాశ్రయంలో పొడిచారు. అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా భారీ కుట్ర ఉందని చెప్పారు. అది ఏమైందని అడగండి. లక్షలాది ఎకరాల్లో గిరిజనులు పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే అది వాళ్లకి దక్కడం లేదు. దాని గురించి మాట్లాడండి. ఇడుపులపాయలో నేలమాళిగలో టన్నులకొద్దీ డబ్బులు ఉంటాయని చెబుతుంటారు. దానిపై కథలు నడపండి. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. చిత్ర పరిశ్రమకు నా వంతుగా, ఇంట్లో వ్యక్తిగా చెబుతున్నా. మీపై దాడి చేస్తున్నప్పుడు బలంగా మాట్లాడండి. చిరంజీవి గారు బతిమిలాడుకోవాల్సిన పనిలేదు. ఇప్పుడు నేను ఇలా గట్టిగా మాట్లాడితే ఇంకా ఇబ్బందులు పెడతారని కొందరు అన్నారు. ఏం చేస్తారో చూద్దాం. వాళ్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, న్యాయమూర్తులపైనే దాడి జరిపిన వాళ్లు.. వాళ్లకు సినీ పరిశ్రమ ఓ లెక్కకాదు.. అయినా మనం అడుగుదాం. పోరాడదాం…’’ అని పవన్ వ్యాఖ్యానించారు.