
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల గెలుపులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హస్తం ఉందని టీఆర్ఎస్ హుజూరాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ టికెట్‌ను బీజేపీకి రూ. 25 కోట్లకు టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమ్మేశారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీచేయడం దేశంలో ఎక్కడా లేదని, కానీ హుజూరాబాద్‌లో జరిగిందని అన్నారు.

టిపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలో తాను హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే 62 వేలకుపైగా ఓట్లు పోలయ్యాయని, కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా బరిలోకి దిగినప్పటికీ చివరికి బల్మూరి వెంకట్ ఎక్స్ట్రా ప్లేయర్‌గా నిలిచిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల నుంచి ఆయనకు పూర్తిస్థాయి సహకారం లభించలేదన్నారు. ఆయన కోసం ప్రచారం చేసేందుకు ఒక్కరు కూడా రాలేదని, చివరికి రెండు పొట్టేళ్ల మధ్య నలిగిపోయిన లేగదూడ పరిస్థితి ఆయనకు ఎదురైందని కౌశిక్ విమర్శించారు.