
రాష్ట్రంలో ఉల్లి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిన్నటిదాకా రూ.20వరకు ఉన్న ఉల్లి ధర ఉన్నట్టుండి ఒక్క సారిగా పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బ తినడం, దిగుబడి తగ్గిపోవడంతో ధరలు క్రమేపి పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉల్లి ధర రూ.40-45వరకు పలుకుతోంది. రాష్ట్రంలోని రైతులు నిల్వ చేసిన పాత ఉల్లికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో కొందరు రైతులు నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరోపక్క ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉన్న పంటలు నాశనమయ్యాయి. అదే సమయంలో నాటువేసిన ఉల్లి చేతికి రావాలంటే మరి కొద్ది నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మహారాష్ట్ర నుంచి దిగుమతులు సైతం తగ్గిపోయాయి. దీంతో అప్పటి వరకు ఉల్లి కొరత తప్పదని, ధరలు పెరుగుతూనే ఉంటాయని వ్యాపారులు అభిప్రాయప పడుతున్నారు.
సాధారణంగా నవంబర్ మొదటి వారంలో కొత్త ఉల్లి మార్కెట్లోకి రావడం మొదలవుతుంది. కానీ, మహారాష్ట్రతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కురవడంతో ఉల్లి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో కొత్త దిగుబడి రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కిలో ఉల్లి రూ.70-80వరకూ పలికే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.