
టాలీవుడ్ హీరోలు తమ అభిమానులను సంతోషపెట్టడం లో ఎవరికీ వారే సాటి. వారి మనసులను అర్థం చేసుకొని వారి కోర్కెలను తీర్చడంలో ముందుంటారు. అభిమానులు ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లు వారికి తెలిస్తే యిట్టె కరిగిపోయి వాళ్ళను సంతోష పెడతారు. కాగా, తాజాగా మన టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే స్పందించారు. చావుబతుకుల్లో ఉన్న అభిమానిని పలకరించి అతడిని అనందంలో ముంచెత్తారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన కొప్పాడి మురళి ఎన్టీఆర్కు వీరాభిమాని. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి మరింతగా విషమించింది.
ఈ క్రమంలో వైద్యులు అతడి కోరికలు, ఇష్టాయిష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఎన్టీఆర్తో మాట్లాడాలని ఉందని చెప్పాడు. దీంతో వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మురళితో మాట్లాడారు. త్వరగానే కోలుకుంటావంటూ అతడిలో ధైర్యం నింపారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తావని ఆకాంక్షించారు.