
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈమధ్య కాలంలో సినిమాల దూకుడు పెంచాడు. వినాయక చవితి సందర్భంగా తన అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు. తన 31వ సినిమా టైటిల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాడు. ఈ సినిమాకి ‘మాచర్ల నియోజక వర్గం’ అనే టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విధ్వంసం సృష్టించిన విలన్ గ్యాంగ్ తన వైపు దూసుకు వస్తుంటే, ధైర్యంగా వాళ్లకి ఎదురు నిలిచిన నితిన్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ‘మాచర్ల నియోజకవర్గం’ అంటే పేరుకు తగ్గట్లుగానే ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది. వినాయకచవితి సందర్బంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లపై ముహూర్తం షాట్ కు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. త్వరలోనే రెగ్యులర్ ను షూటింగ్ ను ప్రారంభించనున్నారు.