
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్… అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ కీలక భేటీ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశానికి.. కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో.. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు.
దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని మరింతగా పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ దిశగా కేంద్ర ఆలోచనలను ఈ సందర్భంగా నిర్మల.. రాష్ట్రాలకు వివరించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, అంతర్గత పెట్టుబడి ఆధారిత వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాలని కోరనున్నారు.
ఈ విషయంలో ఉన్న అడ్డంకులపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. పెట్టుబడుల ప్రోత్సాహానికి అనుకూలమైన విధానం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా తీసుకువచ్చిన సంస్కరణల అమలు, పట్టణ స్థానిక సంస్థల్లో అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసే అంశంపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.