
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫేస్ బుక్ షాక్ ఇచ్చింది. హత్యాచార బాధిత బాలిక కుటుంబ సభ్యుల చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై ఎన్ సీపీసీఆర్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ రాహుల్ గాంధీ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. రాహుల్ పోస్టుపై విమర్శలు రావడంతో దీన్ని తొలగిస్తున్నట్లు ఫేస్ బుక్ తాజాగా ప్రకటించింది. ఇదే విషయాన్ని రాహుల్ కు కూడా తెలియజేసింది.
‘మా సంస్థ విధానాలను ఉల్లంఘించేలా ఉన్న రాహుల్ గాంధీ పోస్టును తొలగించాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని రాహుల్ కు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్ సీపీసీఆర్)కు తెలియజేశాం’ అని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి ఈ మెయిల్ ద్వారా వెల్లడించారు. భారతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలిక తల్లిదండ్రులను పరామర్శించే క్రమంలో రాహుల్ వారితో తీసుకున్న ఫొటో, వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా ట్విట్టర్ ఆయనతో పాటు కాంగ్రెస్ నేతల ఖాతాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని గుర్తించేలా ఉన్న ఆ చిత్రాలను బహిర్గతం చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. రాజకీయంగానూ దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ పోస్టును ట్విట్టర్ తొలగించింది. ఇప్పుడు ఫేస్ బుక్ కూడా ఇన్ స్టా గ్రామ్ లో రాహుల్ పోస్టు తొలగించడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజాల్ని కేంద్రం నియంత్రిస్తోందంటూ రాహుల్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఫేస్ బుక్, ట్విట్టర్ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ట్విట్టర్ నిర్ణయంపై విమర్శలు చేసిన రాహుల్.. ఇప్పుడు ఫేస్ బుక్ నిర్ణయంపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.