
దేశానికి స్వాత్రంత్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెంప పగలగొట్టేవాడినంటూ కేంద్ర మంత్రి నారాయణ రాణే అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ శివసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు రాణేపై నాసిక్, పూణెలలో రెండు ఎఫ్ఐఆర్ లు, రాయ్ గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో మరో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే… కేంద్ర మంత్రిని అరెస్టు చేయాలని రత్నగిరి జిల్లా ఎస్పీని ఆదేశించడంతో రాణేను ఈ రోజు అరెస్టు చేశారు.
అంతకుముందు, రాణేపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్ పై మంగళవారమే అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది.
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం రాయ్ గఢ్ జిల్లాలో రాణే పర్యటించారు. ఈ సందర్భంగానే సీఎం ఠాక్రేపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ’’ముఖ్యమంత్రికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఠాక్రే.. తన ప్రసంగం మధ్యలో వెనక్కి తిరిగి దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయిందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటే కనుక ఠాక్రే చెంప పగటగొట్టేవాడిని” అని రాణే వ్యాఖ్యానించారు.