
సినీ నటుడు సోనూసూద్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. సోనూసూద్ 20కోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేసినట్టు ఆధారాలు సేకరించినట్టు వెల్లడించారు. ముంబై, నాగ్పూర్, జైపూర్లలో ఏకకాలంలో 28 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. సోనూసూద్ ఆర్థిక లావాదేవీలతో పాటు.. సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. 11 లాకర్లను గుర్తించిన ఐటీ అధికారులు..కోటీ 8లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్’ చట్టాన్ని ఉల్లంఘించి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం ను ఉపయోగించి సోనూసూద్ విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించారని ఆదాయపుపన్ను శాఖ అధికారులు చెప్పారు. సోనూసూద్, అతని సహచరుల నివాసాల్లో శోధించడంతో ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించిన సాక్ష్యాలు దొరికాయి.
పన్ను ఎగవేత కోసం ఖాతాలను పుస్తకాల్లో రుణాలుగా మభ్యపెట్టారని అధికారులు చెప్పారు. సోనూసూద్ ఇళ్లు, అతని కార్యాలయాల్లో మూడు రోజుల పాటు జరిపిన దాడుల్లో పన్ను ఎగవేతకు సంబంధించి పలు పత్రాలు దొరికినట్లు ఐటీశాఖ అధికారులు చెప్పారు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశ్ కా మెంటార్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడరుగా పనిచేస్తున్నట్లు సోనూసూద్ ప్రకటించిన నేపథ్యంలో ఆదాయపుపన్ను శాఖ దాడులు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే సోనూసూద్ ఇళ్లపై ఐటీ దాడులు చేయడంపై విమర్శలు కురిపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. సోనూసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారనే.. ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.