
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై అధికార వైసీపీ చేసిన దాడులకు నిరసనగా చంద్రబాబు తలపెట్టిన 36 గంటల నిరశన దీక్ష మొదలైంది. విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదిక ఏర్పాటైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ, అయ్యన్నపాత్రుడు సహా పలువురు టీడీపీ నేతలతో కలిసి ఈ ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.. 8 గంటలకు దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష.. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్ర పరిస్థితులను వివరిస్తారు. అలాగే, జరిగిన ఘటనలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తారు.
చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం సాయంత్రం టీడీపీ నేతలు.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తదితరులు గవర్నర్ వద్దకు వెళ్లనున్నారు.