
సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, మీనా కలిసి నటించిన సినిమా.. దృశ్యం 2. ఏడేళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్ గా రూపొందుతోంది. మలయాళంలో కూడా ఇదే పేరుతో విడుదలైన ఈ సినిమా.. సంచలన విజయం సాధించింది. కొవిడ్ అడ్డంకులు లేకుంటే.. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఇప్పుడు తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ లభించిందని తెలుస్తోంది. ఫ్యామిలీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా, ఈ సినిమాను కూడా ‘నారప్ప’లాగే ఓటీటీలో విడుదల చేసేందుకు తొలుత నిర్మాత సురేశ్ బాబు సన్నాహాలు చేశారు. కానీ, ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఒరిజినల్ మలయాళ ‘దృశ్యం2’ దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమాకూ దర్శకత్వం వహించారు. వెంకటేష్ , మీనాతో పాటు ఎస్తేర్ అనిల్, కృతికా, నదియా, నరేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాని కూడా అతి తక్కువ టైమ్ లో చిత్రీకరణ పూర్తి చేశాడు దర్శకుడు జీతు జోసెఫ్. కేబుల్ ఆపరేటర్ రాంబాబు.. ఓ థియేటర్ ఓనర్ అయి.. మళ్ళీ పాత కేసు విషయంలో కొత్త సమస్యల్ని ఎదుర్కొని వాటిని తన తెలివితేటలతో ఎలా తిప్పికొడతాడు అన్నదే సీక్వెల్ కథాంశం. ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.